facebook pixel
chevron_right Top
transparent
సినీ, రాజకీయరంగాల్లో కాస్టింగ్ కౌచ్ నిజమే
లైంగిక ఆనందాలు అనేవి అటు వినోదరంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా చెప్పారు. కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్, కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని సిన్హా చెప్పారు. నన్ను ఆనందపరిస్తే, నేను నిన్ను ఆనంద పరుస్తాను అనేది దీంట్లో అంతస్సూత్రం. అది చాలా రోజులుగా ఉన్న పద్ధతే. జీవితంలో ముందుకెళ్లడానికి కొన్నిసార్లు కాలం డిమాండ్ చేసినట్లుగా నడుచుకోక తప్పదుఅని సిన్హా పేర్కొన్నారు. సరోజ్‌ఖాన్ కాస్టింగ్‌కౌచ్ గురించి చెప్పిందంటే, చిత్రపరిశ్రమలో నిజంగా అలా జరుగుతున్నదన్నట్లే. సినిమాల్లోకి రావడానికి అమ్మాయిలు ఎలా రాజీ పడాల్సి వస్తున్నదో నాకు తెలుసు. ఆమె వ్యాఖ్యలను నేను పూర్తిగా అంగీకరిస్తాను అని సిన్హా చెప్పారు. రేణుకాచౌదరి వ్యాఖ్యలతోనూ తాను ఏకీభవిస్తానని ఆయన తెలిపారు.
జూలై నాటికి ఇంటింటికీ మిషన్‌భగీరథ నీళ్లు
జూలై చివరి నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు. మరో పదిరోజుల్లో అన్ని ఆవాసాలకు భగీరథ నీళ్లు బల్క్‌గా చేరుతున్నందున ఇంట్రా పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో అన్నిజిల్లాల ఎస్‌ఈ, ఈఈలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పదిరోజులకు కొత్తగా యాక్షన్‌ప్లాన్‌తో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ సర్వీసింగ్ రిజర్వాయర్ల (ఓహెచ్‌ఆర్‌ఎస్) ప్రస్తుత పరిస్థితిని జిల్లాలవారీగా అధికారులు ఆమెకు వివరించారు. మైక్రోలెవల్ ప్లానింగ్‌తో పనిచేస్తేనే ఇంట్రా పనులు పూర్తి అవుతాయని ఆమె చెప్పారు. సోమవారం నాటికి ఇంట్రా పనులకు కావాల్సిన మెటీరియల్ మొత్తాన్ని తెప్పించుకోవాలని, వాటిని పోలీస్‌స్టేషన్లు, మార్కెటింగ్ గోదాముల్లో నిల్వచేసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీల కోసం హెల్ప్‌లైన్
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు టోల్‌ఫ్రీ 155209 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు, లబ్ధిదారులందరూ హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ, స్త్రీ,శిశు సంక్షేమశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం సచివాలయంలో హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా 35వేల అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని, మాతాశిశుసంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సింగరేణిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రానికి ఫోన్‌చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్వర్, డైరెక్టర్ విజయేంద్రబోయి, ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సమకాలీన మార్పులను గుర్తించాలి
ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. 'మై జర్నీ ఫ్రమ్‌ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్‌ సోషలిజం: సమ్‌ మెమోరీస్, రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌'పేరుతో ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్‌ హనుమంతరావు రాసిన పుస్తకాన్ని మన్మోహన్‌ సింగ్‌ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్‌ గాంధీల హయాంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా హనుమంతరావు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మార్క్సిజం-లెనినిజం భావాల నుంచి నెహ్రూవియన్‌ సోషలిజం వైపు వచ్చేందుకు హనుమంతరావుకు ఎక్కువ సమయం పట్టలేదన్నారు. ఆర్థిక అసమానతలను ఇప్పటికీ రూపుమాపలేకపోయామని ఇందుకు కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయండి
కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని కర్ణాటక ప్రజలకు ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. గురువారం మోదీ యాప్‌ ద్వారా కన్నడ ప్రజలు, బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కర్ణాటకలో అధికారం నిలుపుకునేందుకు దురుద్దేశంతో సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఎన్నికల చివరి సమయంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధంగా హామీలు గుప్పించడంలో కాంగ్రెస్‌ నేతలు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అబద్ధపు హామీల గురించి తెలిసే దేశంలో 22 రాష్ట్రాల ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమివేసే వరకు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. బెంగళూరును అభివృద్ధి చేస్తే దేశాన్ని కూడా అభివృద్ధి చేసినట్లేనన్నారు.
ఆవేదనతో ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్య
కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప కొడుకు విజయేంద్రకు పార్టీ టికెట్‌ నిరాకరించడంతో ఆవేదన చెందిన ఇద్దరు కార్యకర్తలు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సిద్దరామయ్య కొడుకు యతీంద్రకు పోటీగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను వరుణ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచించింది. దీంతో విజయేంద్ర నియోజకవర్గంలో రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే అధిష్టానం చివరి నిమిషంలో విజయేంద్రకు మొండిచేయి చూపింది. దీంతో గర్గేశ్వరినికి చెందిన హెళవరహుండి గూళప్ప, సరగూరుకు చెందిన బసవణ్ణలు ఆవేదన చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకున్నారు.
జయ రక్త నమూనాలు మా వద్ద లేవు: అపోలో
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత చికిత్సకు సంబంధించిన వైద్య డాక్యుమెంట్లు, రక్త నమూనాలు తమ వద్ద లేవని అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అమృత అనే యువతి జయలలిత కుమార్తెగా రుజువు చేసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో జయ రక్తనమూనాలపై బదులివ్వాల్సిందిగా జడ్జి అపోలో ఆస్పత్రిని ఆదేశించారు. 'ఆమె చికిత్సకు సంబంధించిన పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాం. చికిత్స సమయంలో ఆమె నుంచి సేకరించిన నమూనాలను అప్పటికప్పుడే వాడేశాం. ప్రస్తుతం మావద్ద ఏమీ లేవు' అని గురువారం కేసు విచారణ సందర్భంగా కోర్టుకు ఆస్పత్రి వివరణ ఇచ్చింది.
మేలో 4 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు
దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహారాష్ట్రలోని భండారా-గోండియా, పాల్ఘర్, యూపీలోని కైరానా, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి మే 28న ఎన్నికలు నిర్వహించనుంది. బీజేపీ నేత పటోలే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో భండారా-గోండియా స్థానం ఖాళీ అయింది. బీజేపీ ఎంపీ చింతమన్‌ వనగ చనిపోవడంతో పాల్ఘర్‌లో, హుకుంసింగ్‌ చనిపోవడంతో యూపీలోని కైరానాలో ఉపఎన్నికలొచ్చాయి. నాగాలాండ్‌లోని లోక్‌సభ ఎంపీ నెయిఫియు ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ 4 స్థానాల్లో ఉపఎన్నికలకు మే 3న నోటిఫికేషన్‌ రానుంది. ఓట్ల లెక్కింపును మే 31న నిర్వహించనున్నారు.
నేడే టీఆర్ఎస్ ప్లీనరీ: ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఏం చెబుతారో?
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 17వ ప్లీనరీ సమావేశాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10గంటలకు(ఏప్రిల్ 27న) హైదరాబాద్ శివారు కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో ఈ ప్లీనరీ ప్రారంభం కానుంది. ప్లీనరీ ప్రాంతానికి ప్రగతి ప్రాంగణంగా నామకరణంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి దాదాపు 13 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు సేవలందించేందుకు దాదాపు రెండువేల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారు.
మీ చుట్టూనే అవినీతిపరులు..
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది నేరస్తులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందన్నారు. కర్ణాటకలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని చుట్టూ పెట్టుకుని తమపై అవినీతి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మోదీ ఇక్కడకు వచ్చి అవినీతి గురించి మాట్లాడతారని, కానీ బ్యాంకులకు రూ.30 వేల కోట్లు మోసగించి పరారైన నీరవ్‌మోదీ గురించి ఆయన మాట్లాడరని చెప్పారు. మోదీ ప్రచారం సందర్భంగా ఏదైనా వేదికపై నిలబడితే ఆయనకు ఒకవైపు యడ్యూరప్ప, మరోవైపు జైలు జీవితం గడిపిన మరో నలుగురు కనిపిస్తారన్నారు.
'బ్రహ్మజ్ఞాని' రేప్‌ చేయటం పాపం కాదట!
బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని రేప్‌చేయడం పాపం కాదని ఆసారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్‌ కె.సచార్‌ జోధ్‌పూర్‌ కోర్టుకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఓ బాలికను రేప్‌చేసిన కేసులో ఆసారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడటం తెల్సిందే. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్‌ సచార్‌ చెప్పిన విషయాలను వెల్లడించింది. పుష్కర్‌(రాజస్తాన్‌), భివానీ (హర్యానా), అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్‌ చెప్పాడు. 'ఆశ్రమంలో ఆసారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు. వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు. ఈ ముగ్గురు బాలికలే ఆసారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు డప్పు కళాకారుల మృతి
జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరకు వచ్చి తిరిగివెళ్తున్న డప్పు కళాకారులపైకి సిమెంటు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కళాకారులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను నారాయణ(43), జయరాం(44), బీరప్ప(72), వెంకటరావు(42), లక్ష్మణ్‌(68)గా గుర్తించారు. వీరంతా నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన వారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర తిలకించి రోడ్డుపై తిరిగి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కళాకారులపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
అడ్డగోలుగా రుణాలు: ఐడీబీఐలో వెలుగులోకి రూ. 600కోట్ల కుంభకోణం
ఇప్పటికే వరుస బ్యాంక్ కుంభకోణాలు ప్రజలను, ప్రభుత్వాలను ఆందోలనకు గురిచేస్తుంటే తాజాగా మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌సెల్‌ మాజీ ప్రమోటర్‌ శివశంకరన్‌కు గ్రూపుతో సంబంధం కలిగిన విదేశీ కంపెనీలకు ఐడీబీఐ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడంతో రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందంటూ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ. ఎయిర్‌సెల్‌ మాజీ ప్రమోటర్‌ శివశంకరన్, అతని కుమారుడు శివశంకరన్‌ శరవణన్‌తోపాటు 2010 నుంచి 2014 వరకు (రుణాలు మంజూరైన కాలంలో) ఐడీబీఐ బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత ఉన్నతాధికారులు మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
కొలీజియం సిఫార్సులు తిరస్కరణ
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు, కేంద్రప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌(59)ను నియమించాలని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని సుప్రీంను కోరింది. కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేవని, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్‌ జోసెఫ్‌ కన్నా అనేకమంది హైకోర్టు సీజేలు, సీనియర్‌ జడ్జీలు సీనియారిటీలో ముందున్నారని, కొలీజియం సిఫార్సులు సముచితం కాదని పేర్కొంది. సిఫార్సుల్ని తిప్పిపంపడానికి కారణాల్ని కొలీజియంకు తెలియచేస్తూ సీజేఐ జస్టిస్‌ మిశ్రాకు న్యాయ శాఖ నోట్‌ పంపింది. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును పునః పరిశీలించాలన్న ప్రతిపాదనను రాష్ట్రపతి, ప్రధాని ఆమోదించారని పేర్కొంది.
కింగ్స్‌కు 'బౌలింగ్' స్ట్రోక్
భారీ హిట్టర్లు అందుబాటులో ఉన్నా. సన్‌రైజర్స్ బౌలర్ల క్రమశిక్షణ ముందు మూగబోయారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను శాసించే ఆటగాళ్లున్నా. కుర్ర స్పిన్నర్ల ధాటికి నిలువలేకపోయారు. ఆరంభంలో దూకుడు చూపెట్టి శుభారంభాన్నిచ్చినా. కీలక సమయంలో పెవిలియన్ క్యూ కట్టిన పంజాబ్ చేజేతుల్లా మూల్యం చెల్లించుకుంది. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. మనీష్ పాండే ఒంటరిపోరాటం చేశాడు. తర్వాత పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (32) టాప్ స్కోరర్. గేల్ (23)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. రాజ్‌పుత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బ్యాంకు వద్దు.. ఇల్లే ముద్దు!
కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలవడంతో జనాలు జాగ్రత్త పడుతున్నారు. చేతికొచ్చిన నగదును చేజారిపోనివ్వడం లేదు. గతకొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లేగాక దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. నగదు కొరత దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్ల ముద్రణను పెంచినా. డిపాజిట్ల కంటే బ్యాంకుల్లో విత్‌డ్రాలే ఎక్కువయ్యాయి మరి. ఆర్బీఐ తాజా వివరాల ప్రకారం ఈ నెల మొదటి మూడు వారాల్లో బ్యాంకుల నుంచి రూ.59,520 కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. అంతకుముందు మూడు వారాల్లో ఇది రూ.16,470 కోట్లుగా ఉండగా, ఒక్క ఏప్రిల్ 20తో ముగిసిన వారం రోజుల్లోనే రూ.16,340 కోట్లను జనాలు తిరిగి తీసేసుకోవడం గమనార్హం.
గుట్కా మాఫీయాపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
గుట్కా కుంభకోణం కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుట్కా విక్రయాలపై విచారణ చేపట్టాలంటూ డీఎంకే ఎమ్మెల్యే అన్బలగళన్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ విచారించిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అబ్దుల్‌ ఖురేషీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో శశికళ కుటుంబంతోపాటు మంత్రి భాస్కర్‌, డీజీపీ రాజేంద్రన్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. 2017 జులై 8న గుట్కా కంపెనీలపై ఐటి దాడులు జరిగాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో గుట్కా మాఫియా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ గుట్కా వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది.
రాహుల్ విమానంలో సాంకేతిక లోపం: అత్యవసర ల్యాండింగ్, మోడీ ఫోన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి గురువారం ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విమాన పైలట్లను విచారించారు. ఈ సందర్భంగా కర్ణాటక పోలీస్ చీఫ్ నీల్ మణి ఎ. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this